
వాల్మీకి రామాయణంలో కొన్ని ఘట్టాలు. 105.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం //
లవకుశులు రామాయణ గాధను ఆలపిస్తున్నారు రాముని సమక్షం లో…
యుద్ధకాండ …..
వానరసేన నుండి విడుదల అయిన శుకుడు, రావణుని వద్దకువెళ్లి, ‘ నీ సందేశాన్ని సుగ్రీవునికి అందజేశాను. వానరులు నను చిదకబాదుతుంటే, రాముడు దయతో వారిని వారించి, నన్ను వదలిపెట్టాడు. సీత కోసం రాముడు వానరసేనతో యిప్పటికే లంకదాపులలో విడిదిచేశాడు. వారు వెల్లువలా , దుర్గ ప్రాకారాలు దూకి రాకముందే, నీవు సీతను రామునికి అప్పగించడమో లేక వారిపై దాడి చెయ్యడమో చెయ్యాలి. రాముని సందేశం కూడా యిదే. ‘ అన్నాడు.
రావణుడు ఆగ్రహంతో, ‘ సీతను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే, ఈ వానరులు సముద్రం మీద వారధి యెలాకట్టారో తలుచుకుంటేనే, ఆశ్చర్యంగా వున్నది. నీవు ‘ సారణుడు ‘ ని తీసుకుని వెళ్లి, వారి బల పరాక్రమాలను రహస్యంగా బేరీజువేసి, నాకు తెలియజెయ్యాలి. ‘ అని ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళేటప్పటికి, వానరులు తీరంవెంట అరణ్యాలలోనూ, పర్వత ప్రాంతాలలోనూ, యిసుకవేస్తే రాలనట్లుగా, వ్యాపించి వుండడంతో, వానరసేన వారికి లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నది. వారి పనిలో వారు వుండగా, విభీషణుడు వారిని కనిబెట్టి రాముని ముందు నిలబెట్టాడు. అందుకు రాముడు నవ్వుతూ, ‘ మీ పరిశీలన మీరు కానివ్వండి. అయితే నా సందేశంగా మళ్ళీ ఒకసారి రావణునికి చెప్పి సీతను మాకు అప్పగించమని చెప్పండి. ‘ అన్నాడు.
కృతజ్ఞతగా వారు రామునికి అంజలిఘటించి, ‘ విజయోస్తు ‘ అని దీవించారు. తిరిగివెళ్లి వారు రావణునితో ‘ రాముడు లంకను, మనలను అందరినీ నాశనం చెయ్యడం ఖాయమని మాకు అనిపిస్తున్నది. రామునితో మైత్రి చేసుకొమ్మని మా సలహా. ‘ అన్నారు. ‘ మీరు వానరులను చూసి భయపడుతున్నారు. మీ మాటలు నేను పట్టించుకోను. ‘ అంటూ వారితో సహా తన సౌధాగ్రాన్ని అధిరోహించాడు. రావణుడు కోరిన మీదట సారణుడు పేరు పేరునా వానర వీరులందరినీ దూరంనుంచి చూపించి, వారి గుణ గణాలను ప్రస్తుతించాడు.
అంతటావ్యాపించి వున్న వానరసేనను లెక్కించడానికి, సారణుడు, ‘ వైదిక గణన పధ్ధతి ‘ అవలంబించాడు. దాని ప్రకారం నూరు వేలు ఒక లక్ష. నూరు లక్షలు ఒక కోటి. లక్ష కోట్లు ఒక శంకువు. లక్ష శంకువులు ఒక మహాశంకువు . లక్ష మహాశంకువులు ఒక వృoదము. లక్ష వృ౦దాలు ఒక పద్మము. లక్ష పద్మాలు ఒక మహా పద్మము. లక్ష మహాపద్మాలు ఒక ఖర్వము. లక్ష ఖర్వాలు ఒక మహాఖర్వము. లక్ష మహాఖర్వాలు ఒక సముద్రము. లక్ష మహా సముద్రాలు ఒక ఓఘము. లక్ష ఓఘములు ఒక మహా ఓఘమని వివరించాడు సారణుడు, రావణునికి. ఈ లెక్కలో వానరసేనలో కనీసం 100 కోట్ల మహౌఘాల సైనికులు వున్నారని తేల్చాడు.
రాముడిని, లక్ష్మణుని యితర వానరవీరులను చూచి రావణుడు కలవరపడ్డాడు. శుక సారణులను తీవ్రంగా దూషించాడు. తరువాత రావణుడు మరికొందరు చారులను పంపాడు. వారుకూడా అదేవిధమైన సలహాలు యిచ్చారు. ఇక రావణుడు తట్టుకోలేక మాయోపాయ చతురుడైన ‘ విద్యుజ్జిహ్వుడు ‘ అనే రాక్షసుని పిలిచాడు. ‘ నీవు రాముని మాయా శిరస్సును సృష్టించు. అలాగే ఆయన ధనుర్ బాణాలను పరిపూర్ణంగా అనుకరిస్తూ తయారు చెయ్యి. నావెంట అశోకవనానికి వచ్చి ఒకచోట దాగివుండు. నేను పిలువగానే వాటిని తీసుకునిరా. . ‘ అని పధకం చెప్పాడు, ఆ రాక్షసునికి.
పధకం ప్రకారం సీతను రావణుడు చూసి, ‘ నీరాముడిని నాసేనాపతి వధించాడు. ఇకనైనా నీ మొండితనానిని విడచి, నీవు నారాణివి కావాలి. నీవు నేను చెప్పేది నమ్మవని నాకు తెలుసు. అందుకే రాముని ఖండిత శిరస్సును తీసుకువచ్చాను. ‘ అని నమ్మ బలికాడు. ఇంద్ర జాలికుడైన విద్యుద్జిహ్వుని పిలివనంపాడు. వెంటనే రాముని మాయాశిరస్సుతో పాటు, రాముని ధనుర్బాణాలను కూడా పుచ్చుకుని, ఆ మాయావి ప్రత్యక్షము అయినాడు, సీతను బెదరగొట్టడానికి.
వాటిని చూడగానే, సీత భయవిహ్వలురాలై అనేకవిధాల పరితపించింది. ‘ ఓ రామా ! నేను లేకుండా పరలోకానికి వెళ్ళావా ‘ అని విలపించింది. ఇంతలో దైవఘటనా అన్నట్లు ప్రహస్తుడు అనే ముఖ్య సచివుడు రావణుని కొరకై అత్యవసర పిలుపుపంపాడు. అలా రావణుడు అక్కడ నుండి నిష్క్రమించగానే, అ మాయాశిరస్సు , ధనుర్బాణాలు కూడా అంతర్ధానమయ్యాయి.
వాల్మీకి రామాయణంలో కొన్ని ఘట్టాలు. 106.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం //
లవకుశులు రామాయణ గాధను ఆలపిస్తున్నారు రాముని సమక్షంలో…
యుద్ధకాండ …….
సభలోకి వస్తూ వస్తూనే రావణుడు, సచివులను, రాక్షససేనను యుద్ధానికి సమాయత్తం చేశాడు. వారు చర్చించడానికి యేవిధమైన అవకాశం యివ్వలేదు. ఈలోగా విభీషణుని సతీమణి, ‘ సరమ ‘ సీతను వోదార్చడానికి అశోకవనానికి వచ్చింది. ఆమెను అప్పటికే రావణుడు సీత ఆత్మహత్య చేసుకోకుండా, జీవితం మీద ఆశతో వుండే మాటలు చెప్పేందుకు నియమించాడు.
